ఖలీదా జియా అంత్యక్రియలకు ప్రధాని మోదీ ప్రత్యేక లేఖతో ఢాకా చేరుకున్న విదేశాంగ మంత్రి జైశంకర్
December 31, 2025

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం ఢాకా చేరుకున్నారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం అనంతరం ఆయన బిఎన్‌పి తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహమాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత సంతాప లేఖను జైశంకర్ ఆయనకు అందజేశారు. భారత ప్రభుత్వం మరియు ప్రజల తరపున తన ప్రగాఢ సానుభూతిని ఈ లేఖ ద్వారా తెలియజేశారు.
ఖలీదా జియా ఆశయాలు, దార్శనికత భారత్-బంగ్లాదేశ్ భాగస్వామ్యానికి మార్గదర్శకంగా ఉంటాయని జైశంకర్ పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారిక లాంఛనాలతో ఆమె భర్త జియావుర్ రెహమాన్ సమాధి సమీపంలో ఖలీదా జియా అంత్యక్రియలు జరగనున్నాయి. పలు దేశాల ప్రతినిధులు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వం తరపున జైశంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.