కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు అబద్ధం.. తెలంగాణ విద్యుత్ రంగంలో సరికొత్త రికార్డు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యుత్ కోతలు తప్పవంటూ గతంలో బీఆర్ఎస్ చేసిన విమర్శలను తిప్పికొడుతూ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అసాధారణ రికార్డును నమోదు చేశాయి. మార్చి 13, 2026న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసి విద్యుత్ శాఖ సరికొత్త మైలురాయిని అధిగమించింది. అదే రోజు ఉదయం 11:17 గంటలకు నమోదైన 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను విద్యుత్ గ్రిడ్ విజయవంతంగా తట్టుకుని నిలబడింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వ్యవసాయ అవసరాల దృష్ట్యా విద్యుత్ వినియోగం భారీగా పెరిగినప్పటికీ, ఎక్కడా అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విజయంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ, రోజుకు 350 మిలియన్ యూనిట్లకు పైగా సరఫరా చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని నిరూపించామన్నారు. విద్యుత్ కోతలు ఉంటాయని తప్పుడు ప్రచారం చేసిన వారి విమర్శలకు ఈ రికార్డులే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, గృహ, పారిశ్రామిక మరియు వాణిజ్య వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విమర్శకుల నోళ్లు మూయించేలా తమ పనితీరు ఉంటుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు