ఓటమి భయంతోనే స్టాలిన్ కుట్రలు చేస్తున్నారంటూ విజయ్ సంచలన వ్యాఖ్యలు
February 23, 2026

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం స్టాలిన్ బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నారని టీవీకే అధినేత విజయ్ ఆరోపించారు. వేలూరు బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, తనను ఓడించేందుకే డీఎంకే ఈ కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. డీఎంకేకు ఓటు వేయడం అంటే బీజేపీకి వేయడమేనని ప్రజలను హెచ్చరించారు.
ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తన సభలకు అనుమతి నిరాకరిస్తున్నారని విజయ్ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని, అవినీతిపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలు అవినీతి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జరిగే యుద్ధమని ఆయన అభివర్ణించారు. టీవీకే అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని విజయ్ హామీ ఇచ్చారు.