ఒంటిమిట్ట రామాలయంలో తిరుమల తరహా ఉచిత అన్నదానం

ఒంటిమిట్ట రామాలయంలో తిరుమల తరహా ఉచిత అన్నదానం

వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించిన ‘నిత్య అన్నదానం’ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఈ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గత ఏడాది శ్రీరామ నవమి కళ్యాణోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తిరుమలలో అమలవుతున్న నిత్య అన్నదాన విధానాన్ని ఒంటిమిట్టలోనూ ప్రవేశపెట్టాలని ఆయన సూచించడంతో, టీటీడీ యుద్ధప్రతిపాదికన ఈ కేంద్రాన్ని సిద్ధం చేసింది. దీనివల్ల ప్రతిరోజూ ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు నిరంతరాయంగా ఉచిత భోజన సౌకర్యం కలుగుతుంది.

మరో వారంలో ఒంటిమిట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నూతనంగా ప్రారంభించిన అన్నదాన కేంద్రం భక్తుల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *