ఉక్రెయిన్ అభివృద్ధిని పుతిన్ కోరుకుంటున్నారన్న ట్రంప్ వ్యాఖ్యలకు జెలెన్ స్కీ నవ్వులు

రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా దయగలవారని, ఉక్రెయిన్ ఒక విజయవంతమైన దేశంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ట్రంప్ నోట పుతిన్ పై ప్రశంసలు విన్న జెలెన్ స్కీ తన ఆశ్చర్యాన్ని ఆపుకోలేక నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యుద్ధ విరమణ దిశగా జరిగిన ఈ చర్చల్లో దాదాపు 95 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా హామీ ఇచ్చినప్పటికీ డాన్‌బాస్ ప్రాంతం అప్పగింతపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. పుతిన్ ఉక్రెయిన్ కు తక్కువ ధరకే విద్యుత్, ఇంధనం అందాలని కోరుకుంటున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సంక్లిష్ట సమస్య పరిష్కారం కాకపోతే యుద్ధం మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.