ఇమ్రాన్ ఖాన్ హత్య అయ్యారా? అడియాలా జైలు వద్ద ఉద్రిక్తత- సోదరీమణులను ఈడ్చుకెళ్లిన పోలీసులు!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) బంధీగా ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులో (Adiala Jail) ఆయన భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయనను హింసిస్తున్నారనే ఆరోపణల మధ్య, ఆఫ్ఘనిస్తాన్ మీడియాలో ఆయన మరణ వార్తలు వ్యాపించడంతో ఈ ఆందోళన మరింత పెరిగింది. మంగళవారం రాత్రి (నవంబర్ 25), ఇమ్రాన్ సోదరీమణులను (నోరీన్ ఖాన్, అలిమా ఖాన్, మరియు ఉజ్మా ఖాన్) జైలు గేటు వద్ద కలిసేందుకు అనుమతించకపోగా, వారిని పంజాబ్ పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. దీని పర్యవసానంగా, వేలాది మంది పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) మద్దతుదారులు ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి జైలు బయట గుమిగూడారు.
సంవత్సరానికి పైగా ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన కుటుంబ సభ్యులు లేదా పార్టీ నాయకులను కలువనివ్వకపోవడంతో ఆయన భద్రతపై అనుమానాలు ఉన్నాయని పీటీఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉంటే, ఆయనను ఎందుకు ఒంటరిగా ఉంచుతున్నారని మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన మరణ వార్తలను ప్రభుత్వం ‘పుకారు’గా కొట్టిపారేస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యులను కలువనివ్వకపోవడం ఈ అస్థిరతను మరింత పెంచుతోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి జైలు బయట భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు.