ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు విడుదల

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇళ్ల నిర్మాణ పనుల్లో ఉన్న వేలాది మంది పేదలకు పెద్ద ఊరట లభించినట్లయింది.

తొలి విడతలో భాగంగా మొత్తం 2,764 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. వీరి కోసం ప్రభుత్వం రూ. 28.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, కేవలం వారం రోజుల్లోనే ఈ బిల్లులను క్లియర్ చేయడం గమనార్హం. గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గౌతమ్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

సాంకేతిక కారణాల వల్ల నిధులు ఆగిపోయిన వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. గత వారంలో ఎల్-3 జాబితాలోని 1200 మందికి రూ. 12.06 కోట్లు, బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న 653 మందికి రూ. 7 కోట్లు చెల్లించారు. అభ్యంతరాల వల్ల ఆగిపోయిన మరో 911 మందికి కూడా రూ. 9.40 కోట్లు విడుదల చేస్తున్నారు.

మొదటి విడతలో ఇప్పటికే 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు లభించాయి. త్వరలోనే రెండో విడత జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఏప్రిల్ నెలలో మరిన్ని కొత్త ఇళ్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *