ఆపరేషన్ మహాదేవ్, పహల్గామ్ దాడి సూత్రధారితో సహా ముగ్గురు ఉగ్రవాదులు హతం, సైన్యానికి భారీ విజయం

జమ్మూ కాశ్మీర్, జూలై 29, 2025, సోమవారం. భారత సైన్యం ‘ఆపరేషన్ మహాదేవ్’లో కీలక విజయం సాధించింది. భద్రతా దళాలు పహల్గామ్ దాడి ప్రధాన సూత్రధారి, లష్కర్ ఉగ్రవాది సులేమాన్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. శ్రీనగర్ సమీపంలోని దచిగామ్ అటవీ ప్రాంతంలో అందిన రహస్య సమాచారం మేరకు భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి.
ఈ ఎదురుకాల్పుల్లో అబు హంజా, యాసిర్ అనే మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. గత ఏప్రిల్ 22న పహల్గామ్లో టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. ఆ ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్లో ‘ఆపరేషన్ సిందూర్’ గురించి మాట్లాడుతున్న సమయంలోనే ఈ విజయం గురించి వార్తలు వచ్చాయి.