అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ: త్యాగాలకు ప్రతీక అన్న చంద్రబాబు

అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ: త్యాగాలకు ప్రతీక అన్న చంద్రబాబు

భాషా ప్రయుక్త రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరు పార్కులో ఆయన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ (త్యాగ చిహ్నం) అని నామకరణం చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో రాష్ట్రం ఏర్పడితే, రైతుల త్యాగంతో రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వ హయాంలో రాజధానిని మూడు ముక్కలు చేసి అయోమయ స్థితికి నెట్టారని చంద్రబాబు విమర్శించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రజల రాజధానిగా అభివృద్ధి చేస్తోందని స్పష్టం చేశారు. సుమారు 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఇనుముతో నిర్మించిన ఈ విగ్రహం అమరావతిలోనే మొదటి భారీ శిల్పమని ఆయన పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతి అభివృద్ధిని ప్రపంచం చూస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అమరజీవి స్ఫూర్తితో ప్రతి ఇంటికి నీరు అందించే పథకానికి ‘అమరజీవి జలధార’గా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *