అమరావతిలో ఆకాశమే హద్దుగా ఐదు ఐకానిక్ టవర్లు 2028 నాటికి పూర్తికానున్న పరిపాలన రాజధాని పనులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సోమవారం మంత్రి నారాయణ హెచ్ఓడీ టవర్-1 కోసం తొలి స్టీల్ డయాగ్రిడ్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. అత్యాధునిక డయాగ్రిడ్ సాంకేతికతతో అమరావతిలో ఐదు ఐకానిక్ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ పనులన్నీ 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
మొత్తం 53 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో జీఏడీ టవర్ 47 అంతస్తులతో, మిగిలిన టవర్లు 40 అంతస్తులతో రూపుదిద్దుకుంటున్నాయి. పరిపాలన యంత్రాంగం అంతా ఒకే చోట ఉండేలా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ కార్యాలయాలను డిజైన్ చేసినట్లు మంత్రి వివరించారు.
రాజధానిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లతో పాటు ప్రైవేట్ సంస్థల నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి. రైతులకు ఇచ్చిన హామీ మేరకు అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు.
మరోవైపు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు మంత్రి నివాళులర్పించారు. అమరావతిలో ఆయన 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం తెలుగు జాతికి గర్వకారణమని, ఆయన త్యాగం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు.