అమరావతిలో ఆకాశమంత ఎత్తున అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం శ్రీరాములు చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో నిర్మించారు.
శాఖమూరు పార్కులోని 6.80 ఎకరాల విస్తీర్ణంలో ‘అమరజీవి త్యాగ శిల్పం’ పేరుతో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని తయారీలో దాదాపు 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఇనుప నిర్మాణాన్ని ఉపయోగించారు. కేవలం ఆరు నెలల రికార్డు సమయంలోనే విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రాజెక్టు మొదటి దశను అందుబాటులోకి తీసుకువచ్చారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి భారీ చారిత్రక కట్టడంగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఇక్కడ మ్యూజియం, ఆడిటోరియం మరియు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడి స్మృతిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా భావితరాలకు ఆయన త్యాగాన్ని చాటిచెప్పేలా అడుగులు పడ్డాయి. అమరావతి నడిబొడ్డున ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా శ్రీరాములు చేసిన సేవలకు ప్రభుత్వం సముచిత గౌరవాన్ని కల్పించింది.