అజ్ఞాతం వీడి సిట్ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య

అజ్ఞాతం వీడి సిట్ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య

మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఎట్టకేలకు బయటకు వచ్చారు. గత కొంతకాలంగా పోలీసుల కళ్లుగప్పి అజ్ఞాతంలో ఉన్న ఆమె, హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం రాజమహేంద్రవరంలోని సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

రాజమహేంద్రవరం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో అరెస్ట్ భయంతో లక్ష్మీదుర్గ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం, ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం విచారణకు సహకరించాలని ఆమెను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం అధికారుల ముందుకు రాగా, సిట్ బృందం ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

హత్య జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలో లేనని లక్ష్మీదుర్గ గతంలో బుకాయించినప్పటికీ, సాంకేతిక ఆధారాలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. సీసీటీవీ ఫుటేజీలు మరియు డిజిటల్ సాక్ష్యాల ప్రకారం, హత్య జరిగిన రాత్రి ఆమె అనంతబాబుతోనే ఉన్నారని, మృతదేహాన్ని తరలించే సమయంలో కూడా ఆమె క్రియాశీల పాత్ర పోషించారని సిట్ నిర్ధారించింది. ఈ పక్కా ఆధారాలతోనే పోలీసులు ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశారు. నేటి విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *